🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 April 2026, 1:21 am Posted by : DAINAMIC NEWS

సూర్యాపేటలో హత్య కేసు తీర్పు అత్త హత్య కేసులో కోడలికి జీవిత ఖైదు

News Image

సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్,ఏప్రిల్ 28




ఆస్తి వివాదం కారణంగా అత్తను హత్య చేసిన కేసులో నిందితురాలికి సూర్యాపేట జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.




నిద్రిస్తున్న సమయంలో దారుణ హత్య




2020 ఆగస్టు 29న ఆత్మకూరు మండలం రామోజీ తండాకు చెందిన 75 ఏళ్ల గుగులోతు మీరి నిద్రిస్తున్న సమయంలో, ఆమె కోడలు గుగులోతు కీరి (55) ఇనుప రాడ్‌తో తలపై దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదు అయింది.




పోలీసుల దర్యాప్తు – కోర్టులో చార్జ్‌షీట్




మృతురాలి కుమార్తె బానోతు ముత్యాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ కేసును విచారించి, ఆస్తి కోసం మరియు వృద్ధురాలిని పోషించేందుకు ఇష్టంలేక హత్య చేసినట్లు నిందితురాలిపై అభియోగ పత్రాలు కోర్టులో దాఖలు చేశారు.




సాక్ష్యాధారాలతో నేరం నిర్ధారణ




కేసులో సాక్షులను, ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితురాలు నేరానికి పాల్పడినట్లు నిర్ధారించింది.




జీవిత ఖైదు – జరిమానా విధింపు




నిందితురాలికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఒక నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.




ప్రాసిక్యూషన్ వాదనలు




ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పీపీ లింగయ్య వాదనలు వినిపించారు. కేసు నిర్వహణలో పీసీ శివరామ్, కోర్టు డ్యూటీ లైజన్ అధికారి శ్రీకాంత్ సహకరించారు.

🏠 Home