🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 October 2026, 9:08 pm Posted by : DAINAMIC NEWS

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.18 లక్షలు స్వాహా మరో రూ.2 లక్షల బదిలీకి బ్యాంకు అధికారుల అప్రమత్తతతో అడ్డుకట్ట

News Image
ముఖ్యమైన పాయింట్స్:డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.18 లక్షలు స్వాహామరో రూ.2 లక్షల బదిలీకి బ్యాంకు అధికారుల అప్రమత్తతతో అడ్డుకట్ట
డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.18 లక్షలు స్వాహా

మరో రూ.2 లక్షల బదిలీకి బ్యాంకు అధికారుల అప్రమత్తతతో అడ్డుకట్ట

కుషాయిగూడ, అక్టోబర్‌ 8, శుభోదయ డైనమిక్
.
డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో 66 ఏళ్ల రిటైర్డ్‌ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్లు బెదిరించి సుమారు రూ.18 లక్షలు స్వాహా చేశారు. మరో రూ.2 లక్షలు బదిలీ చేసే సమయంలో బ్యాంకు అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరింత నష్టం తప్పింది.ఏఎస్‌ రావు నగర్‌కు చెందిన బాధితుడు గురువారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏఎస్‌ రావు నగర్‌ శాఖలో తన ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తుల ఖాతాకు రూ.2 లక్షలు బదిలీ చేశాడు. అయితే బాధితుడు తీవ్ర భయాందోళనలో ఉండటాన్ని గమనించిన బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌ సూచనలతో కుషాయిగూడ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఈసీఐయూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తరుణ్‌, పీసీ రాజు (సైబర్‌ యోధుడు) బ్యాంకుకు చేరుకున్నారు. అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లి విచారించగా.. అక్టోబర్‌ 5న ఫేస్‌బుక్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి నుంచి వీడియో కాల్‌ వచ్చిందని, దానిని స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించినట్లు తెలిపారు.వీడియోను యూట్యూబ్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించేందుకు డబ్బులు చెల్లించాలని నిందితులు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులుగా పరిచయం చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తూ మొత్తం రూ.30 లక్షలు డిమాండ్‌ చేయగా.. బాధితుడు ఇప్పటికే సుమారు రూ.18 లక్షలు చెల్లించినట్లు వెల్లడైంది.బాధితుడి ఖాతాల్లో సుమారు రూ.80 లక్షల నగదు, ఎఫ్‌డీలు, ఇతర డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని మరిన్ని నగదు లావాదేవీలు జరగకుండా చర్యలు చేపట్టారు. బాధితుడికి సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించి, నిందితులతో ఇకపై ఎలాంటి సంప్రదింపులు జరపవద్దని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలపై నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసి, డిజిటల్‌ ఆధారాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

🏠 Home