🏠 www.dainamicnews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 8:58 am Posted by : DAINAMIC NEWS

నిమ్మ తోటల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడులు, నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతులు పాటించాలి

News Image
ముఖ్యమైన పాయింట్స్:నిమ్మ తోటల యాజమాన్యంపై రైతులకు శిక్షణఅధిక దిగుబడులు, నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతులు పాటించాలి

నడిగూడెం శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 13

నడిగూడెం: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామంలో నిమ్మ తోటల సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిరి ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), గడ్డిపల్లి, ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతు తంగెళ్ల చంద్రయ్య నిమ్మ తోటలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గోసుల రాజేష్ అధ్యక్షత వహించగా, జిల్లా ఉద్యాన శాఖాధికారి టీ. నాగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి మల్సూర్, ఉద్యాన శాఖ అధికారి అనిత, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, సిరి ఫౌండేషన్ ప్రతినిధి ఎం. గోపి, కేవీకే శాస్త్రవేత్తలు సీహెచ్. నరేష్, ఎ. కిరణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్. నరేష్ మాట్లాడుతూ, నిమ్మ తోటల్లో అధిక దిగుబడులు, నాణ్యమైన పండ్లు పొందేందుకు సమతుల్య ఎరువుల వినియోగం, సరైన నీటి యాజమాన్యం, సకాలంలో కొమ్మల కత్తిరింపు, కలుపు నివారణ, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని సూచించారు. మొక్కల వయస్సు, నేల స్వభావాన్ని బట్టి ఎరువులు, సూక్ష్మపోషకాలను సిఫార్సుల మేరకు అందించాలని తెలిపారు.కేవీకే శాస్త్రవేత్త ఎ. కిరణ్ మాట్లాడుతూ, నిమ్మ తోటల్లో సిట్రస్ లీఫ్ మైనర్, సిట్రస్ సిల్లా, పండు తొలుచు ఈగలు, పొలుసు పురుగులు, పేనుబంక వంటి పురుగుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆకులపై మచ్చలు, కొమ్మలు ఎండిపోవడం, పండ్లపై గాయాలు, ఆకులు ముడుచుకోవడం వంటి లక్షణాలను గుర్తించి, సమస్య తీవ్రతను బట్టి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వివరించారు.తోటల్లో గుమ్మటపు తెగులు, కొమ్మ ఎండు తెగులు, వేరుకుళ్లు వంటి సమస్యలను నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎండిన, వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలని, తోట పరిశుభ్రత పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారు. నేలలో తేమను బట్టి నీటిని అందించాలని, పూత, కాయ అభివృద్ధి దశల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.నిమ్మ తోటల్లో కొమ్మల నిర్వహణ, కత్తిరింపు, మొక్కల ఆకృతి నిర్వహణ సక్రమంగా చేపట్టడం వల్ల గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడి మొక్కల ఆరోగ్యం పెరుగుతుందని వివరించారు. పురుగుమందులు, శిలీంద్రనాశకాలను సమస్యను నిర్ధారించిన తర్వాతే సిఫార్సు చేసిన మోతాదుల్లో, భద్రతా సూచనలు పాటిస్తూ వినియోగించాలని సూచించారు.అనంతరం శాస్త్రవేత్తలు రైతులతో కలిసి నిమ్మ తోటను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పురుగులు, తెగుళ్లు, పోషక లోపాలు, మొక్కల పెరుగుదలకు సంబంధించిన సమస్యలను చర్చించారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి, తోట పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సూచనలు అందించారు.నిమ్మ సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం, పురుగులు, తెగుళ్ల వల్ల కలిగే నష్టాలను తగ్గించడం, నాణ్యమైన దిగుబడులు సాధించి రైతుల ఆదాయాన్ని పెంపొందించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు అర్జున్ రావు, మేకల గోవర్ధన్, మేకల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home