Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన బందోబస్తు 350 మంది పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు – 163 BNSS నిషేధాజ్ఞలు అమలు

Author
Posted By DAINAMIC NEWS
| 12 Feb 2026, 05:53 AM | తాజా సమాచారం
సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన బందోబస్తు 350 మంది పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు – 163 BNSS నిషేధాజ్ఞలు అమలు


సూర్యాపేటబ్యూరో, ఫిబ్రవరి 12, డైనమిక్ న్యూస్



మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సూర్యాపేట జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద 350 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.



163 BNSS (144 సెక్షన్) అమలు



ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 163 BNSS (144 సెక్షన్) నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.లెక్కింపు కేంద్రంలోకి ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థులు, ఏజెంట్లకే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. తనిఖీలలో పోలీసులకు సహకరించాలని సూచించారు.



విజయోత్సవ ర్యాలీలకు పూర్తి నిషేధం


ఇవి కూడా చదవండి


ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు వినిపించడం, టపాకాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ఎస్పీ హెచ్చరించారు. గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు



లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు మూడంచెల భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బందోబస్తు, క్యూఆర్టీ టీములు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీములు, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.



ప్రజలకు విజ్ఞప్తి



ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడుతూ ఎన్నికల ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని జిల్లా ఎస్పీ కె. నరసింహ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతామని హెచ్చరించారు.