Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనుమతులు లేకుండానే చెరువులో మట్టి దందా.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

Author
Posted By DAINAMIC NEWS
| 27 Aug 2026, 05:37 AM | తాజా సమాచారం
అనుమతులు లేకుండానే చెరువులో మట్టి దందా.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు


పాలకవీడు,శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 27



పాలకవీడు మండల పరిధిలోని జాన్‌పహాడ్ చెరువు తండా ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలోని చెరువులో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో చెరువు మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.మట్టి తరలింపు వ్యవహారంపై సంబంధిత ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా, తమకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని, విషయం తెలిసిన వెంటనే మట్టి తరలింపును నిలిపివేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే అధికారులు స్పందించేలోపే పెద్ద మొత్తంలో మట్టి తరలిపోయిందన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.



ఎవరి అనుమతులతో మట్టి తరలింపు?



ప్రభుత్వ ఆధీనంలోని చెరువులో భారీగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత శాఖలకు సమాచారం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు చెరువులు, ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉండగా.. మరోవైపు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తవ్వకాలపై పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి


శాఖల మధ్య సమన్వయం ఏది?



పాలకవీడు మండలంలో ప్రభుత్వ భూములు, చెరువులు, అటవీ ప్రాంతాలకు సంబంధించిన అంశాల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు అది తమ శాఖ పరిధిలోది కాదంటూ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకోవడం సరికాదని ప్రజలు అంటున్నారు.“ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే అధికారులు ఎవరు?” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయా? జరిగితే ఎంత మేరకు మట్టి తరలించారు? ఎవరి అనుమతులతో ఈ వ్యవహారం సాగింది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ప్రకృతి పరిరక్షణ, చెరువుల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



చర్యలు ఎప్పుడు?



చెరువులో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న మట్టి తవ్వకాలపై అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, అనుమతులు లేకుండా తరలింపు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చెరువులను భవిష్యత్ తరాలకు రక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని వారు పేర్కొంటున్నారు.అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారు? బాధ్యులను గుర్తించి అడ్డుకుంటారా? లేక మట్టి దందా యథావిధిగా కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు పాలకవీడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.