Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డప్పు కళను బతికిస్తున్న మహిళా కళామాతల్లులుహుజుర్‌నగర్ నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల మహిళల విశిష్ట ప్రయత్నం

Author
Posted By DAINAMIC NEWS
| 09 Mar 2026, 04:32 AM | తాజా సమాచారం
డప్పు కళను బతికిస్తున్న మహిళా కళామాతల్లులుహుజుర్‌నగర్ నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల మహిళల విశిష్ట ప్రయత్నం


గరిడేపల్లి, మార్చి 9 (డైనమిక్ న్యూస్)



అంతరించిపోతున్న డప్పు కళకు కొత్త ఊపిరి పోస్తూ హుజుర్‌నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ వాయిద్య కళ అయిన డప్పును సంరక్షించేందుకు ఈ మహిళలు నడుంబిగించి రంగంలోకి దిగారు. కాళ్లకు గజ్జెలు కట్టి “ఝం తక్ నకనక్… తరిగిడత తరిగిడతా…” అంటూ లయబద్ధంగా డప్పు దరువులు కొడుతూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు.సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ నియోజకవర్గంలోని అప్పన్నపేట, పొనుగోడు, హనుమంతులగూడెం, పరెడ్డిగూడెం, దిర్శించర్ల, కల్మల్ చెర్వు, శ్రీనివాసపురం గ్రామాలకు చెందిన మహిళలు కలిసి ప్రత్యేక డప్పు బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు.



అంతరించిపోతున్న కళకు కొత్త ఊపిరి



ఒకప్పుడు గరిడేపల్లి మండలంలో డప్పు కళ ఎంతో ప్రాచుర్యం పొందింది. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి కార్యక్రమంలో డప్పు దరువులు వినిపించేవి. అయితే కాలక్రమేణా డప్పు కళాకారులు తగ్గిపోవడంతో ఈ కళ అంతరించిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన మహిళలు ఈ కళను తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని నిర్ణయించారు.



గురువు మార్గదర్శకత్వంలో శిక్షణ



డప్పు కళను నేర్చుకునేందుకు గురువుల కోసం వెతుకుతున్న సమయంలో గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ ముందుకు వచ్చారు. అంతరించిపోతున్న కళను బతికించాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచితంగా డప్పు వాయిద్యం నేర్పించేందుకు ఆయన ముందుకు రావడం విశేషం.



ఉదయం కూలి… రాత్రి విద్య



ఈ మహిళలు ఉదయం కూలి పనులకు వెళ్లి, రాత్రి సమయంలో డప్పు శిక్షణ పొందారు. మొదట పీటలు, చెక్కలపై సాధన మొదలుపెట్టి క్రమంగా వేదికలపై ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం హైదరాబాదులోని రవీంద్రభారతి, రాజ్ భవన్ వంటి ప్రముఖ వేదికలతో పాటు ఢిల్లీ ఎర్రకోట వద్ద కూడా తమ ప్రతిభను ప్రదర్శించే స్థాయికి చేరుకున్నారు.



ఎనిమిది గ్రామాల నుంచి 200 మంది మహిళలు



డప్పు కళను ఇప్పటివరకు ఎక్కువగా పురుషులే అభ్యసించేవారు. అయితే ఈ మహిళలు కులమతాలకు అతీతంగా కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది గ్రామాల నుంచి సుమారు 200 మంది మహిళలు డప్పు వాయిద్య కళలో శిక్షణ పొందడం విశేషం.

ఇవి కూడా చదవండి



రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు



ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత డప్పు కళాకారుడు అందె భాస్కర్ ప్రోత్సాహంతో ఈ మహిళలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు కూడా వీరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.



పోటీల్లో తొలి బహుమతి



ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి డప్పు పోటీల్లో ఈ మహిళా బృందం మొదటి బహుమతి సాధించి తమ ప్రతిభను చాటుకుంది.



ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి



డప్పు కళను బతికించేందుకు తాము కృషి చేస్తున్నామని మహిళలు తెలిపారు. తమ పిల్లలకు కూడా ఈ కళను నేర్పుతూ బాల బృందాలను తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తరఫున మరింత ప్రోత్సాహం లభిస్తే డప్పు కళ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.









మహిళా కళాకారులు




పోలే స్వరూప (అప్పన్నపేట), మొద్దుల నాగమణి (హనుమంతులగూడెం), రాపోల్ అపర్ణ (దిర్శించర్ల), రామ్ రాణి (పొనుగోడు) తదితరులు ఈ డప్పు బృందంలో సభ్యులుగా ఉన్నారు.